Monday, February 15, 2010

"మా నిషాద!.."-తెలంగాణ

భారతీయ వాఙ్మయంలో మొట్టమొదటి శ్లోకం -
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః
యత్ క్రౌంచ మిధునా దేకమవధీః కామమోహితమ్
అనే వాల్మీకివాక్కు.
దీనికర్థం -
"ఓవేటగాడా! నువ్వు పరస్పరప్రేమతో ఉన్న క్రౌంచపక్షులజంటలో
ఒకదానిని అన్యాయంగా చంపేసావు. మరొకదాని దుఃఖానికి హేతువయ్యావు.
నువ్వు బాగుపడవురా! నాశనమై పోతావు" -అని.

ఈ శ్లోకంలోని వేటగాడు వాడొకడే కాదు. రామాయణార్థంలో రావణుడు.
ఆయా కాలాల్లో అందుకు అర్థమైనవాళ్ళూ.
అంతే కాదు మహర్షులు ఒక్కసారి అంటే కోటిసార్లు అన్నట్లు. అంటే అదే మాట
ఈ సృష్టి ఉన్నంతకాలం మాటిమాటికీ ఈ ఆకాశంలో ధ్వనిస్తుందన్నమాట.

ఇక్కడ పక్షులజంటలో ఒక పక్షిని చంపడం అనేది కేవలం సంకేతం. ఏ విధమైన
అన్యాయమైనా, ఇతరులకు చేసే అధర్మం ఏదైనా అదే ఫలితాన్నిస్తుంది. ఈ శ్లోకంలో
క్రౌంచవియోగం కాదు ఆయువు, దానివల్లకలిగిన ‘కడుపుకోత’ ఆయువు.
అన్యాయంగా ఎవరికి కడుపుకోత కలిగించినా ఆ పాపానికి ఫలితం ఈ శ్లోకార్థం.
కడుపుమంట పెత్తినవాళ్ళు సమూలంగా నాశనమౌతారని తాత్పర్యం.
(రావణాసురుడలాగే అయ్యాడు- భంధుమిత్రపరివారసహితంగా.)

నిన్న (ఇదివరకెన్నో సార్లు) విద్యార్థులమీద పోలీసులు లాఠీచార్జీ చేసారు. "లేకుంటే ఆ
పిల్లలు గొడవలు చేయవచ్చుగా?" అందుకే ముందుజాగ్రత్త చర్యగా పొట్టుపొట్టు కొట్టారు.
ఎందుకైనా మంచిదని కరెంటు బంద్ చేసి, రబ్బరుగుండ్ల తూటాలు పేల్చారు.
మరో జలియన్‌వాలాబాగ్‌ను తలపించారు.
ముందుచూపుకలవారైరి, అందుకే మీడియావారినీ నిరోధించారు.లేకుంటే విద్యార్థుల్లో ఉన్న
రాహుకేతువులసంగతి బయటపడుతదాయె వాళ్ళ వీడియోలవల్ల. వాళ్ళేమో అస్మదీయులాయె.

"పిల్లలను అదుపుచేస్తా,వెళ్ళనివ్వండన్న" ప్రొఫేసర్‌నూ నిరోధించారు. ఆయన వెళ్ళి నిజంగానే
పిల్లలను అదుపుచేస్తే మన రాహుకేతువుల సంగతి బయట పడుతుందికదా! అంతే కాకుండా
ఈ మాష్టార్లు మాటలతో బాగానే పిల్లలందరినీ అదుపుచేస్తారు ( అది ఇవాల్టిది కాదు.
పురాణకాలంనుండీ అంతే. పరమదుర్మార్గులైన రాక్షసులు సైతం వాళ్ళగురువు శుక్రాచార్యుని మాట
జవదాట లేదు. అటువంటిది, వట్టి మానవపిల్లలు. వీళ్ళు తప్పక వింటారు) అలా వాళ్ళు అదుపు చేస్తే
"తమ పద్ధతులు(దండం దశగుణం భవేత్) మాత్రమే శాంతిభద్రతల రక్షణకు ఏకైకమార్గమ"నే సూత్ర
రహస్యం బట్టబయలు కాదూ?


చూడవచ్చిన ఆడబిడ్డల్నీ పొట్టుపొట్టు కొట్టి తమ సమధర్మాన్ని నిరూపించుకున్నారు.


ఈ చర్యలతో తెలంగాణాలోని మానవతావాదులందరికీ కడుపుకోత కలిగింది. తెలంగాణతల్లి
తనబిడ్డలపై తేలినవాతలను చూసి తల్లడిల్లింది. "కలకంఠికంట కన్నీరొలికిన సిరి ఇంటనుండనొల్లదు"
అంటారే! అదికూడా వీళ్ళకు తోచలేదా?ఆడిపిల్లలనెలా కొట్టారయ్యా? వాళ్ళకు పిల్లలు లేరా?కలుగరా?
గొడ్డుమోతులా? అని ఆక్రోశించింది.

ఏమైతేనేం? ప్రస్తుతం తెలంగాణావాదులు కోరుకునేదేమంటే. మాకు ఈ లాఠీదెబ్బలు, తూటాదెబ్బలు
మా తాతలనుండే అలవాటు. నాడు ఆ రజాకర్లు. నేడు ఈ రజాకర్లు. మేముతింటూనే ఉంటాం దెబ్బలు.
కాని, ప్రజలను హింసించినవాళ్ళు సమూలంగా నాశనమయ్యారే తర్వాతి కాలంలో? ఆ దుర్గతి మా
ఈ కాలపు రజాకర్లు అయిన పోలీసన్నలకు, వారిని నడిపించే వారికీ ఈ మానిషాద శ్లోక శాపం కలుగుతుందేమో అని చింతిస్తున్నాము.

మాలోని ఏ కొంచెం పుణ్యమున్నా" ఆ అమాయకులకు(ఆ పోలీసులకు,అధికారులకు, వారి మంత్రులకు, ముఖ్యమంత్రికీ, అధికారపార్టీకి) ఆ శాపం తలగవద్దనీ ఆ ఆదిమహర్షిని వాల్మీకిని వేడుకుంటున్నాము.

Wednesday, February 10, 2010

తెలంగాణ మంత్రులేం చేసారు?



"మన రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అన్ని ప్రాంతాల, జిల్లాల, సామాజికవర్గాల మంత్రులు ప్రతి మంత్రివర్గంలోనూ ఉంటూనే ఉన్నారాయె. మరి అటువంటప్పుడు- కేవలం తెలంగాణేతర ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందెట్లా? తెలంగాణలో జరుగలేదెట్లా?"
ఇది సీమాంధ్రులు అడిగే ప్రశ్న. అది చాలా హేతుబద్ధమైన ప్రశ్న. దానికి సమాధానమూ తెలుపాలి.

నిజంగా చెప్పాలంటే...
"బొత్స సత్యనారాయణ 130 కోట్లలో తెలంగాణాకు 10 కోట్లే ఇచ్చాడు. తన ఒక్క జిల్లాకు మాత్రం 20 కోట్లు ఇచ్చుకున్నాడు. మిగిలినవి మిగిలిన సీమాంధ్రకు ఇచ్చాడు.
రఘువీరారెడ్డి 800 కోట్ల నిధుల్లో తనజిల్లాకు 400 కోట్లు, తన దేవుడి కడప జిల్లాకు 200 కోట్లు ఇచ్చాడు. మిగిలిన 200 కోట్లు మాత్రమే మిగిలిన రాష్ట్రానికి సర్దాడు.
.....కాబట్టి మకు అన్యాయమైంది" అంటున్నారు తెలంగాణవాళ్ళు.
మరి మీ మంత్రులు మీకు చేస్తారులే. చెయ్యలేదా అనేది ప్రశ్న. "ఎందుకు చెయ్యలేదు సాములు! మా మంత్రులు మాకూ చేసారు. ఉదాహరణకు మా సబితమ్మ ఉంది. ఆమె రజాకర్ల మంత్రి. ఆమె చేతులో ఏముంటాయి? తుపాకులూ, దుడ్డుకర్రలూనూ. ఆమె ఊరుకుందా? తన చేతిలో ఉన్నవాటిని తన జిల్లాలోని విద్యార్థులకు కడుపునిండా పెట్టింది.....తుపాకీ గుండ్లతోనూ,దుడ్డు కర్రలతోనూ...అంతే కాదు....రోగంతో నెల్లతరబడి ఆస్పత్రిలో ఉన్న దుష్టులపైనా పెట్టింది కేసులు. అంతే కదా వడ్డించేవాడు మనవాడయితే ఏ మూలనున్నా వడ్డన అందుతుంది కాదా?
కాబట్టి సీమాంధ్రులారా, అక్కడి మంత్రులారా! మీరేం మా గురించి బాధపడకండి. మావాళ్ళూ మాకూ వడ్డిస్తున్నారు.

మా దహనం నాగేందరూ ఉన్నాడు. వారి పేరులోవలె మా ఆశలనూ, ఆశయాలనూ దహనం చేస్తూ, నాగేంద్రుడాయె..రెండునాలుకలతో మాట్లాడుతూ....తన పదవీ, తన డబ్బు ఇతోధికంగా పెరుగాలనే ఏకైక అత్యాశతో పని చేస్తాడు.
ఇక మాకేం తక్కువ ? మీకంటే గొప్పవాళ్ళే మామంత్రులు. "ఇంటికి జెష్ట పొరుక్కు లక్ష్మీ" అని....

ఇలా చెప్పుకు పోతుంటే.... ఆగదిది...



Monday, February 8, 2010

"తెలంగాణా బెదుర్స్" - అదుర్స్ నిర్మాత

"తెలంగాణావాదులు మొరిగేకుక్కలు- అవి కరవ లేవు",
"మంచంలోనుండి లేస్తే మనిషిని కాదు - అనడమే కానీ, చేయగలిగింది ఏమీ లేదు".
"తెలంగాణా ఉడతల చప్పుడుకు ఆకులేం రాలవు", "తెలంగాణా ఉద్యమం నేతల్లోనే కానీ ప్రజల్లో లేవు-దానికి నా అదుర్స్ చిత్ర విజయమే నిదర్శనం"
" ఇంత చేవచచ్చిన ఉద్యమాన్ని అణిచివేయలేకపోతున్న ముఖ్యమంత్రి దద్దమ్మ"...
ఇవే కాకుండా ఇంకా తెలంగాణాకోసం అమరులైనవారి గురించికూడా వారి నోటినుండి కొన్ని వ్యాఖ్యలు వెలువడినట్లుగా ఈ రోజు ఆయన ప్రకటనవల్ల అర్థమౌతుంది.

ఈ వ్యాఖ్యలు ఆయన సినిమా బాగా ఆడి, రావాల్సిన లాభాలు దండుకున్నాక మాట్లాడినవి. ఇవే మాటలు సినిమా విడుదలప్పుడు మాట్లాడ లేదెందుకో? -ఎందుకంటే అప్పుడు తన ప్రయోజనం నెరవేరాలి కనుక. ఇప్పుడో....ఏరు దాటాక తెప్పను తగలెయ్యాల్సిందేగా?

ఈ సన్నివేశం తెలంగాణా వాదులకు కనువిప్పు కలిగించాలి. సీమాంధ్రులు తమను ఏ విధంగా మానవేతరప్రాణులుగా, కేవలం తమ సంపాదనకు ఉపయోగపడే వస్తువులుగా పరిగణిస్తున్నారో తెలుసుకోవాలి. వారి తత్వం ఇప్పటికైనా తెలుకుకోగలగాలి. ఇప్పటికీ పౌరుషం రాకుంటే, వచ్చినా దాన్ని సక్రమ మార్గంలో వినియోగించుకోకుంటే.... వాళ్ళు అనేదేం? మనమే సరెండర్ అవుదాం- "మీకు వెట్టిచాకిరీ చేయడానికే పుట్టిన బానిసలమ"ని.

లేదా పౌరుషంతో సరియైన ప్రతిచర్య చేద్దాం.
"ప్రతిచర్య" అంటే కొట్టడం కాదు. తిట్టడం కాదు.వాళ్ళనూ, వాళ్ళ వ్యాపారాలను అడ్డుకోవడం కాదు. కుక్క నిన్ను కరుస్తే నువ్వు కుక్కను తిరిగి కరవడం కాదు. గాంధేయమార్గంలో సరియైన పద్ధతిలో సహాయనిరాకరణ, వారి సేవల తిరస్కారం, వారి ఉత్పత్తులను బహిష్కరించడం చేద్దాం.

చేసే ఉద్యమం వల్ల పిల్లలు కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ జీవితాలను నష్టపోవద్దు. అనవసర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దు. వారి జీవితాలకు కాకున్నాక ఈ ఉద్యమాలెందుకు?

మొదటగా రెండు చేద్దాము.
ఒకటి-
సినిమాల బహిష్కరణ. తెలంగాణావాదులెవ్వరూ ‘తెలంగాణ వచ్చేవరకు’సినిమాలు చూడొద్దని దీక్ష పూనుదాం. ( ఒక్క అదుర్స్ సీనిమాను అడ్డుకుంటామంటేనే.... ప్రపంచం కిందిమీద అయిపోయింది వాళ్ళకు. ఇక ఏ సినిమా నడవకుంటే వాళ్ళకు శ్వాసనే ఆడదు. కాబట్టి ఇది మొదటి నియమం.)

రెండు- ఇక ప్రభుత్వానికీ మన ఉద్యమంసెగ తాకడం లేదు.కాబట్టి, వారికీ తెలిసి వాచ్చేదొక నిర్ణయం తీసుకుందాం.
అది-
"తెలంగాణ వచ్చేవరకు మద్యం ముట్టం". ప్రభుత్వాదాయంలో సింహభాగం మద్యానిదే కనుక ఈ నిర్ణయంవల్ల కలిగే నష్టమే తెలుపుతుంది తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో ఉందో. దాన్ని ఏ లాబీలు దాచిపెట్టలేవు.

ఈ రెండు చేద్దామని జేయేసి ప్రకటించాలి మొదటగా. ఆ తర్వాత వరుసగా ప్రణాళిక వేసుకొని "వచ్చేవారంనుండి ఇదికూడా చేస్తాం" (ఉదా.ఆంధ్రా కార్పోరేట్‌విద్యాసంస్థల్లో మా పిల్లలను చేర్చం...ఇలా)అంటూ మొదటగానే ప్రకటించి, సీమాంధ్రులకూ, ప్రభుత్వానికీ హడలు పుట్టించవచ్చు. తెలంగాణ సాధించనూ వచ్చు.

ఇక అసలు సమస్య- "ప్రకటించగానే సరా? అందరూ దాన్ని పాటించాలిగా? అదెంత కష్టం?" అనేది.
నిజమే. మొదటగా ప్రకటించండి.
తర్వాతచెప్పండి -
" తెలంగాణకోసం లాఠీలదెబ్బలు, బుల్లెట్ దెబ్బలు తిన్న,తింటున్న పిల్లలు నీ పిల్లలు కారా? వాళ్ళంతంత దెబ్బలు తింటుంటే నీకు సినిమా చూడకుంటే నడవదా? మద్యం తాగాల్సిందేనా?

తెలంగాణకోసం ఆత్మత్యాగాలు చేస్తున్నారే? వాళ్ళలా అమరులౌతుంటే కూడా నీ కడుపుకు మద్యం దిగుతుందా? సీనిమా చూడాల్సిందేనా?

తెలంగాణకోసం తమ చదువులనూ అటకెక్కించి, జీవితాలను పణంగా పెట్టి, కేసుల్లో ఇరుక్కుంటున్నారే? అయినా నువ్వు మద్యం తాగి సినిమా చూస్తూ ఆనందించగలుగుతావా?"
-అని.

మొదటి రోజు స్పందన రాక పోవచ్చు. రెండవరోజు కొంత రావచ్చు. వారం తర్వాత ఎందరో ఈ దీక్షను చేపట్టవచ్చు.
ఒకవేళ సరియైన స్పందన లేకుంటే.... పోనీయండి. ‘నాని’ మాటలే నిజమనుకుందాం. ప్రజల్లో ఉద్యమం లేదనుకుందాం.
ఉంటే అందరం పూనుకుందాం.

మరో మాట
నానీ లాంటివాళ్ళు చెప్పుదెబ్బలు కొట్టి, తప్పయిందని కాళ్ళమీద పడతారు. పనయ్యే వరకు మంచిగుండి, పనికాగానే పీకలు నులుముతారు.
కాబట్టి జాగ్రత్త తెలంగాణావాదులారా! మీరే సమయాన కొంచెం వంగినా మీమీద త్రివిక్రములై విక్రమిస్తారీ సీమాంధ్రులు. అలా జరిగితే -మరొక వందేళ్ళైనా తెలంగాణ రాదు. అసలప్పుడు తెలంగాణ అనేదే ఉండదు.

Saturday, January 2, 2010

తెలంగాణ ఉద్యోగాలు

"ఆంధ్రులు తెలంగాణ వారి ఉద్యోగాలు కొట్టేస్తున్నారు" అనేదానిని సీమాంధ్రులు తేలికగా కొట్టేస్తున్నారు. అవి కేవలం అబద్ధాల మాటలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. "ఎవరికి తెలివి ఉంటే వారికే ఉద్యోగాలు వస్తాయి" అని ఓ అతితెలివి లాజిక్ ప్రయోగించి స(ఇ)కిలిస్తారు. కానీ ఈ రోజు మా యూనియన్ మిత్రుడితో జరిగిన సంభాషణలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి.

హైదరాబాద్‌‌లో ఉన్న మా ప్రధానకార్యాలయంలో ఇరువయ్యేళ్ళక్రితం(మేము ఉద్యోగంలో చేరేనాటికి) అన్ని పోష్ట్స్ ఉండేవి కావు. ఎంతోమంది క్లర్క్స్, సెక్షన్ ఆఫీసర్స్ మా కళ్ళముందే అక్కడ ఉద్యోగాల్లో చేరారు. అయితే అందరూ తెలంగాణేతరులే.

"వారి నియామకం పత్రికాప్రకటనలద్వారా చేసారా?" అని నేను అడిగా.

"కాదు వారు హైదరాబాద్ ఉపాధికల్పనా కార్యాలయంనుండి కాల్‌లెటర్స్ వస్తే, ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యి, ఉద్యోగాలు సంపాదించార"ని మా యూనియన్ మిత్రుడు తెలిపాడు.

"అదెలా సాధ్యం? హైదరాబాద్ ఎంప్లాయ్‌‌మెంట్ ఎక్స్చేంజ్‌‌లో తెలంగాణేతరులు ఎలా నమోదయ్యారు?" అనేది నా సందేహం.

ఆయన చెప్పాడు "తెలివంటే పుస్తకాల్లోని చదువు అనుకునే స్వాతిముత్యాలకు ఇది విచిత్రం. కాని, బ్రతికే తెలివి ఉన్నవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటాడు. నువ్వు దీనికే ఆశ్చర్యపడుతున్నావు. మన హెడ్ ఆఫీస్‌‌లో పనిచేసే 'ఫలానా' సెక్షన్ ఆఫీసర్ విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో వేరే ఉద్యోగం చేస్తూ, ఇక్కడ అప్పుడే హైదరాబాద్ ఎంప్లాయ్‌‌మెంట్ ఆఫీస్‌‌లో పేరు నమోదు చేసుకొని, కాల్‌లెటర్ తెచ్చుకొన్నాడు" అని.

"ఇన్ని తెలిసిన నువ్వు వీటిపై ఏమి చర్య తీసుకున్నావు?" నా ప్రశ్న.

"మన హెడ్ ఆఫీస్‌‌లో ఎవరెవరు ఎక్కడివారో ఆధారాలతో తెలుపుతూ, 610 జి.వో. అమలు పర్యవేక్షణాధికారి రవికాంత్ రెడ్డి/రమాకాంత్ రెడ్డి (ఆ పేరు మర్చిపోయా) గారికి లేఖలు సమర్పించాము. కానీ ప్రయోజనం ఏమీ లేదు. ప్రభుత వారిది. ఎవ్వరేం చెయ్యలేరు."

"మరి ఇవన్నీ వివరాలు పత్రికలో వస్తే...?"

"ఎంత అమాయకుడవు తమ్మీ! పత్రికల్ల్లో వార్తలకు భయపడినవాడెవడయ్యా? ఆ మధ్యలో గురుకులవిద్యాలయాల్లో దొంగ సర్టిఫికెట్స్ తో ఉపాధ్యాయులుగా చేరినారనే వార్త చదివావా పత్రికల్లో? వాళ్ళు కడప జిల్లావాళ్ళు. అప్పటి ముఖ్యమంత్రి జిల్లావారైరి. వారు ఈరోజుకూ హాయిగా ఉద్యోగాలు చేస్తున్నారు. వారిమీద ఈ నాటికీ ఏ విధమైన విచారణా లేదు. అదే పని నువ్వు చేసి ఉంటే... దానికి కటకటాలు లెక్కపెట్టేవాడివి. అదీ తేడా నీకూ , తెలంగాణేతరుణికీ. "

నా తలకాయ గిర్రున తిరిగింది. అయినా ఇన్ని చెప్పినా మన సమైక్యాంధ్ర అన్నలు బుకాయిస్తూనే ఉంటారు. అయినా వారు కోరే సమైక్యాంధ్ర అందుకేగా?

షరా :- 'దొర' గారు పెద్ద కొత్వాలుగా ఉన్న కాలంలో ఒకేసారి శ్రీకాకుళం జిల్లానుండి ౩౦౦౦ మంది హోంగార్డ్స్‌‌ని తీసుకొన్నారు. ఒకే జిల్లాలో అంతమంది సమర్థులు ఎలా దొరికారో? మిగిలిన జిల్లాల్లో ఎందుకు లేరో? ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్.

Friday, January 1, 2010

ఆంధ్రా సి.యం.ను అనే అర్హత తెలంగాణీయులకు లేదు

అయ్యలారా తెలంగాణావాదులారా!

మీరు అనవసరంగా రోషయ్యగారిని అపార్థం చేసుకుంటున్నారు " ఈయన మమ్మల్ని ఒకతీరు, సీమాంధ్రులని ఒకతీరు చూస్తున్నాడు" అంటూ.
కానీ, ఇందులో ఆయన తప్పేమీ లేదు.అంతా శాస్త్రోక్తమే జరుగుతుంది. ఎందుకంటే వారు ఒక్క తెలంగాణాకో, మరే ప్రాంతానికో మాత్రమే ముఖ్యమంత్రి కారు.వారు ప్రస్తుతమున్న సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రివర్యులు. మీరా విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి సమైక్యాంధ్ర ఉద్యమకారులకు వారు సహకరించడం తప్పు కాదు. అందులో ప్రాంతీయ తత్వం అస్సలు లేదు. ప్రస్తుతం మీరూ సమైక్యాంధ్రలోనే ఉన్నారు. గుర్తుంచుకోండి. అంటే వారు తమరిపక్షమూ వహించారని తాత్పర్యం. అది ప్రభుత్వపాలసీని చక్కగా అమలు పర్చడం అన్నమాట. అందుకే వారూ, వారి రజాకర్లూ పాటు పడతారు.అది తథ్యం. అర్థం చేసుకోలేకపోతె అది తమ ఖర్మ.

ఇక మరోవాదం.తెలంగాణా వాదులని అన్యాయంగా అణచివేస్తున్నారని. అయ్యా! తమరిది వేర్పాటువాదం. తమరు వేరువడి మీ ప్రాంతాన్ని పక్కనున్న పాలి దేశంలో కలుపుదామని చూస్తున్నారు. కాబట్టి వేర్పాటువాదాన్ని,వాదులనూ ఏ ప్రభుత్వమూ సహించదు కాక సహించదు. అందులోనూ తప్పేమీ లేదు. అదీ శాస్త్రోక్తమే!

ఇక ప్రత్యేకాంధ్ర ఉద్యమకారులను ఎలా చూస్తున్నరో నాకు తెలీదు కానీ వారి పట్ల కొంచెం ఎక్కువ సమదృష్టితో చూస్తే తప్పేమీ లేదు. ఎందుకంటే ఎవరికైనా జన్మభూమిపై మమకారం ఉండి తీరాల్సిందే. ఉండకుంటేనే తప్పు.

కాబట్టి తెలంగాణావాదులారా అందరూ మూస్కొని, రోషయ్యవారి మహత్వపూర్ణమైన పరిపాలనను వేనోళ్ళ పొగడండి.పుణ్యం వస్తుంది.

Wednesday, December 30, 2009

సమైక్యాంధ్రోద్యమం?

సమైక్యాంధ్ర ఉద్యమ సందర్భంగా ఆ కాలం లో నాకు కలిగిన భావాలు .....ఆంధ్రా అన్నతో తెలంగాణ తమ్ముడి మాటలు గేయ రూపంలో.....

అన్నా! నీ కడుపునిండ
మేమంటే పామురమే !
తమ్ముళ్ళని గారువమే
అర్లుగారి పోతున్నదె !

కంటినిండ కనికారం
హృదయంలో ఉపకారం
విడువలేని మమకారం
తెలియ లేని మూర్ఖులమే !

తమిళులతో పడకుంటే
విడిపొదామని యంటివి
అదే మేము అడుగుతుంటె
కలిసుందా మంటున్నవు
అన్నా! నీ కడుపునిండ
మేమంటే పామురమే?

అరవలతో అలిసి పోయి
విడిపోయే దొకనీతి
బక్కోళ్ళను విడువకుండ
కలిపుంచుట మరో నీతి
అన్నా! నీ నీతి ముందు
కౌటిల్యం బలాదూరు.

అసెంబ్లీలొ వద్దన్నా
నీ రాష్ట్రం సాధిస్తివి
మా రాష్ట్రం కోసమైతే
గదే అడ్డు చెబుతుంటివి
అన్నా! నీ కత్తికైతె
రెండక్కల పదునుందే!

తమిళులతో విడివడితే
మద్రాసును అడుగుతవా?
తెలంగాణ విడిపోతే
హైద్రబాదు గావాల్నా?
నీ ఆస్తికి అంతుందా?
అంత పెద్ద కడుపుందా?

ఒల్ల నిన్ను పొమ్మన్నా
మల్ల మల్ల వస్తున్నవ్
సల్లగ పుల్లగ నీకు
సక్కంగనె ఉన్నది లే!
పిల్లికేమొ చెలగాటం
ఎలుకకేమొ యమగండం

విడిపోదామంటుంటే
"అందరనా" లంటున్నవు
గొంగట్లో పెండ లెక్క
పట్టుకోని విడిపోవూ?
బలవంతపు సంసారం
బతికి బట్టగడ్తదా?

శతాబ్దాల ఉద్యమాలు
ఉత్తగానె కనిపిస్తయ్
రాత్రి రాత్రి పుట్టుకొస్తె
గొప్పగానె అనిపిస్తయ్
ఉద్యమాల తీరు తెన్ను
నీ నుంచే నేర్వాలే.

తెలంగాణ అన్నప్పుడె
లేని తలలు పుట్టుకొచ్చు
రాయలోరి రాజ్యమనీ
కళింగాంధ్రదేశమనీ
నడుమనోడు నడిపించే
నాటకాలు తెల్వయానె?

రాబోయే ఆంధ్రరాష్ట్ర
ముక్యమంత్రి పీటానికి
సూటివెట్టి యాడించకు
సూటిగ గజ్జెప్పరాదె?
అన్నా! నీ తెలివిముందు
తెల్లోడే తెల్లవోవు

క్షణాల్లోనె ఉద్యమాలు
రగిలించే తెలివి నీది
నిన్నుజూసి మావోళ్ళూ
సోయి దెచ్చుకుంటున్నరు
"అవసరాన్ని బట్టి ముందు
రాజినామ" అంటున్నరు

"పెద్దమనిషి కప్పగిస్తె
గిట్ల జేస్తదనుకోలే"
పిల్లనిచ్చి పెళ్ళి జేస్తె
తల్లి జేస్తడనుకోలే

రెండు నాల్కలున్నందుకు
పామునైతె జంప్తమాయె
నాల్గు నాల్కలుండి గూడ
అన్నవయ్యె బతికితివి

మాట లేదు పార్టి లేదు
ఆడితప్పు ఘన చరితులు
బలిపశువును విడువకుండ
కలిసుండే అద్వైతులు

సిగ్గు లేని నీ తెగింపె
లోకంలో గొప్పది లే.

-------

తెలంగాణా(అ)మిత్రులకు ......

ఈ రోజు విశ్వామిత్రులవారి బ్లాగ్‌‌లో చదివాను. పాపంవారికి తెలంగాణా అమాయకులపై ఎంత దయ? వారంటారు...

"తెలంగాణావిషయానికి వస్తే (అమాయక) విద్యార్ధులు, ప్రజలు విభజనవల్ల తమకు ఉద్యోగాలు
వస్తాయని తమ బ్రతుకులు మెరుగవుతాయని భావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.
కానీ
ఒక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రావారిని పిలిచి ఇచ్చెయ్యలేదు. పోటీ
పరీక్షలలో ఎంపికైనవాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ తాము మిగిలినవారితో
పోటీపడలేమనుకున్నప్పుడు దానికొక పరిష్కార మార్గాన్ని చూడవలసిన అవసరం ఉంది."

అని.

... కానీ వారికీ విషయం తెలియదంటారా? దానికి నేను రాసిన సమాధానం ఇక్కడ పొందుపరుస్తున్నా.( నాకో అనుమానం నా సమాధానాన్ని వారు ప్రచురించరేమో అని. తెలుగుసేవవారి అటువంటి సేవ చూసాముగా?)

అయ్యా విశ్వామిత్రవర్యా!
ఉద్యోగాలు మీరన్నట్లు పోటీ పరీక్షలు రాసి, ప్రతిభను ప్రదర్శించినవారికే వస్తాయి.కానీ,పాపం కొందరు అల్పజీవులు ఉంటారు. ఏదో ఇంత ఇంటర్,టిటిసి చేసి చిన్న బడిపంతులు ఉద్యోగం చేసుకొని బకుదామని ఆశ పడతారు.వారికి వారివారి జిల్లాల్లో ఉండే మన ప్రభుత్వం వారు ఎలెక్షన్స్ ముందు పెట్టే ఉద్యోగాలజాతరలో ఉద్యోగాలు రావాలి. అవేమో పరిమిత సంఖ్యలో ఉంటాయాయె. వేరే జిల్లాల్లోకేమో( ఈ అమాయకులకు)వెళ్ళరాదాయె. అయ్యా! అక్కడుంది కిటుకు. "ఆ స్థానిక ఉద్యోగాల్లో" ఆ జిల్లావాడుకాని అస్మదీయులు ఉద్యోగాలు సంపాదిస్తారు. పాపం ఈ అమాయకజీవులు మరోసారి రాయలసీమ మారాజు గారో, కోస్తా మారాజుగారొ వచ్చే ఎలెక్షన్స్ ముందు ప్రకటించే అబద్ధపు,తనకు రాని ఉద్యోగం కోసం చొంగ కార్చుకుంటూ కూర్చొంటారు.
( మీకేమైనా సందేహముంటే,హైదరాబాద్ దగ్గరలో ఉన్న మెదక్ జిల్లాలో చూడండి. ఎంతమంది తెలంగాణేతరులు స్థానిక ఉద్యోగాల్లో ఉన్నారో తెలుస్తుంది. ఇదైతే అబద్ధం కాదుగా? వస్తారా? లెక్కలు చూసుకుందాము.)

షరా:- విశ్వామిత్రులకు ధన్యవాదాలు.వారు నా సమాధానాన్ని ప్రచురించి, ఏదో సమాధానమైతే రాసినందులకు.