Wednesday, December 30, 2009

సమైక్యాంధ్రోద్యమం?

సమైక్యాంధ్ర ఉద్యమ సందర్భంగా ఆ కాలం లో నాకు కలిగిన భావాలు .....ఆంధ్రా అన్నతో తెలంగాణ తమ్ముడి మాటలు గేయ రూపంలో.....

అన్నా! నీ కడుపునిండ
మేమంటే పామురమే !
తమ్ముళ్ళని గారువమే
అర్లుగారి పోతున్నదె !

కంటినిండ కనికారం
హృదయంలో ఉపకారం
విడువలేని మమకారం
తెలియ లేని మూర్ఖులమే !

తమిళులతో పడకుంటే
విడిపొదామని యంటివి
అదే మేము అడుగుతుంటె
కలిసుందా మంటున్నవు
అన్నా! నీ కడుపునిండ
మేమంటే పామురమే?

అరవలతో అలిసి పోయి
విడిపోయే దొకనీతి
బక్కోళ్ళను విడువకుండ
కలిపుంచుట మరో నీతి
అన్నా! నీ నీతి ముందు
కౌటిల్యం బలాదూరు.

అసెంబ్లీలొ వద్దన్నా
నీ రాష్ట్రం సాధిస్తివి
మా రాష్ట్రం కోసమైతే
గదే అడ్డు చెబుతుంటివి
అన్నా! నీ కత్తికైతె
రెండక్కల పదునుందే!

తమిళులతో విడివడితే
మద్రాసును అడుగుతవా?
తెలంగాణ విడిపోతే
హైద్రబాదు గావాల్నా?
నీ ఆస్తికి అంతుందా?
అంత పెద్ద కడుపుందా?

ఒల్ల నిన్ను పొమ్మన్నా
మల్ల మల్ల వస్తున్నవ్
సల్లగ పుల్లగ నీకు
సక్కంగనె ఉన్నది లే!
పిల్లికేమొ చెలగాటం
ఎలుకకేమొ యమగండం

విడిపోదామంటుంటే
"అందరనా" లంటున్నవు
గొంగట్లో పెండ లెక్క
పట్టుకోని విడిపోవూ?
బలవంతపు సంసారం
బతికి బట్టగడ్తదా?

శతాబ్దాల ఉద్యమాలు
ఉత్తగానె కనిపిస్తయ్
రాత్రి రాత్రి పుట్టుకొస్తె
గొప్పగానె అనిపిస్తయ్
ఉద్యమాల తీరు తెన్ను
నీ నుంచే నేర్వాలే.

తెలంగాణ అన్నప్పుడె
లేని తలలు పుట్టుకొచ్చు
రాయలోరి రాజ్యమనీ
కళింగాంధ్రదేశమనీ
నడుమనోడు నడిపించే
నాటకాలు తెల్వయానె?

రాబోయే ఆంధ్రరాష్ట్ర
ముక్యమంత్రి పీటానికి
సూటివెట్టి యాడించకు
సూటిగ గజ్జెప్పరాదె?
అన్నా! నీ తెలివిముందు
తెల్లోడే తెల్లవోవు

క్షణాల్లోనె ఉద్యమాలు
రగిలించే తెలివి నీది
నిన్నుజూసి మావోళ్ళూ
సోయి దెచ్చుకుంటున్నరు
"అవసరాన్ని బట్టి ముందు
రాజినామ" అంటున్నరు

"పెద్దమనిషి కప్పగిస్తె
గిట్ల జేస్తదనుకోలే"
పిల్లనిచ్చి పెళ్ళి జేస్తె
తల్లి జేస్తడనుకోలే

రెండు నాల్కలున్నందుకు
పామునైతె జంప్తమాయె
నాల్గు నాల్కలుండి గూడ
అన్నవయ్యె బతికితివి

మాట లేదు పార్టి లేదు
ఆడితప్పు ఘన చరితులు
బలిపశువును విడువకుండ
కలిసుండే అద్వైతులు

సిగ్గు లేని నీ తెగింపె
లోకంలో గొప్పది లే.

-------

తెలంగాణా(అ)మిత్రులకు ......

ఈ రోజు విశ్వామిత్రులవారి బ్లాగ్‌‌లో చదివాను. పాపంవారికి తెలంగాణా అమాయకులపై ఎంత దయ? వారంటారు...

"తెలంగాణావిషయానికి వస్తే (అమాయక) విద్యార్ధులు, ప్రజలు విభజనవల్ల తమకు ఉద్యోగాలు
వస్తాయని తమ బ్రతుకులు మెరుగవుతాయని భావిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.
కానీ
ఒక విషయం, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రావారిని పిలిచి ఇచ్చెయ్యలేదు. పోటీ
పరీక్షలలో ఎంపికైనవాళ్ళకే ఇచ్చారు. ఒకవేళ తాము మిగిలినవారితో
పోటీపడలేమనుకున్నప్పుడు దానికొక పరిష్కార మార్గాన్ని చూడవలసిన అవసరం ఉంది."

అని.

... కానీ వారికీ విషయం తెలియదంటారా? దానికి నేను రాసిన సమాధానం ఇక్కడ పొందుపరుస్తున్నా.( నాకో అనుమానం నా సమాధానాన్ని వారు ప్రచురించరేమో అని. తెలుగుసేవవారి అటువంటి సేవ చూసాముగా?)

అయ్యా విశ్వామిత్రవర్యా!
ఉద్యోగాలు మీరన్నట్లు పోటీ పరీక్షలు రాసి, ప్రతిభను ప్రదర్శించినవారికే వస్తాయి.కానీ,పాపం కొందరు అల్పజీవులు ఉంటారు. ఏదో ఇంత ఇంటర్,టిటిసి చేసి చిన్న బడిపంతులు ఉద్యోగం చేసుకొని బకుదామని ఆశ పడతారు.వారికి వారివారి జిల్లాల్లో ఉండే మన ప్రభుత్వం వారు ఎలెక్షన్స్ ముందు పెట్టే ఉద్యోగాలజాతరలో ఉద్యోగాలు రావాలి. అవేమో పరిమిత సంఖ్యలో ఉంటాయాయె. వేరే జిల్లాల్లోకేమో( ఈ అమాయకులకు)వెళ్ళరాదాయె. అయ్యా! అక్కడుంది కిటుకు. "ఆ స్థానిక ఉద్యోగాల్లో" ఆ జిల్లావాడుకాని అస్మదీయులు ఉద్యోగాలు సంపాదిస్తారు. పాపం ఈ అమాయకజీవులు మరోసారి రాయలసీమ మారాజు గారో, కోస్తా మారాజుగారొ వచ్చే ఎలెక్షన్స్ ముందు ప్రకటించే అబద్ధపు,తనకు రాని ఉద్యోగం కోసం చొంగ కార్చుకుంటూ కూర్చొంటారు.
( మీకేమైనా సందేహముంటే,హైదరాబాద్ దగ్గరలో ఉన్న మెదక్ జిల్లాలో చూడండి. ఎంతమంది తెలంగాణేతరులు స్థానిక ఉద్యోగాల్లో ఉన్నారో తెలుస్తుంది. ఇదైతే అబద్ధం కాదుగా? వస్తారా? లెక్కలు చూసుకుందాము.)

షరా:- విశ్వామిత్రులకు ధన్యవాదాలు.వారు నా సమాధానాన్ని ప్రచురించి, ఏదో సమాధానమైతే రాసినందులకు.

Tuesday, December 29, 2009

తెలంగాణా ఇస్తే అప్పుల లెక్క ఎలా?

ఇప్పుడు తెలంగాణా ఇవ్వడానికి మరొక సాంకేతిక పరమైన అడ్డంకి చెబుతున్నారు. అది.."ఆస్తుల పంపకం సరే,కానీ మన రాష్ట్ర అభివృద్ధికొరకంటూ ఇంతకాలం అప్పులు తెచ్చాముగా? ఆ అప్పులను ఎలా పంచుకుంటాం?" అంటున్నారు.
నిజమే! ఇది పెద్ద సమస్యే! అందుకే తెలంగాణా ఇవ్వొద్దు కదా?
మరి, ఒకవేళ దానికి అద్భుత పరిష్కారం దొరికితే? మీకు అభ్యంతరముండదనుకుంటా...
అలాగైతే దానికి అద్భుత పరిష్కారముంది.


ఇంతకాలం మనం అందరి పొత్తుల అప్పులు చేసాము.నిజమే.వాటికి లెక్కలైతే ఉన్నాయా దేని కొరకు ఎంత తెచ్చామని? అయిపాయే. సమస్యకు అదే పరిష్కారం.
ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని డబ్బులు అప్పుగా తెచ్చామో, అవి ఎక్కడేక్కడ ఖర్చు చేసామో చూసి, ఆ పద్దును ఆ ప్రాంతం పద్దుగా రాసుకోవాలి. అయితే ఈ విషయం లో మాత్రం జగ్రత్త వహించాలి. కెటాయింపులే కాదు, నిజంగా చేసిన ఖర్చును గమనించాలి. అంతే.సింపుల్. చక్కగా ఎవరు తిన్నదానికి వారే భరిస్తారు బిల్లును. అంతే కదా?


( ఈ విషయం సమిక్య వాదులకు నచ్చదనుకోండి. "మేం తింటుంటే మీరు బిల్లులు చెల్లించే ఈ సౌకర్యాన్ని ఎలా వదులుకోవాలి?" అదీ అసలు బాధ.)

Sunday, December 20, 2009

తెలుగుసేవకు సవాల్

నేను తెలుగు సేవలో
http://groups.google.co.in/group/teluguseva/browse_thread/thread/2f7ec45a2bbb843f?hl=en

అనే చర్చలో ఈ ప్రశ్నలు సంధించా. అందులో ఏం తప్పుందో? మరివాళ్ళు దాన్ని ఎందుకు ప్రచురించలేదో వాళ్ళకే తెలియాలి.అవి.....

మిత్రులారా!
నాకు కొన్ని సందేహాలున్నాయి.తెలిసినవారు చెప్పండి.
1."ప్రస్తుతం తెలంగాణావాళ్ళకు కావాల్సింది స్వంత రాష్ట్రం కాదు.అభివృద్ధి" అన్నారు.
ఇన్నాళ్ళూ అటువంటి ప్రయత్నం జరుగలేదా? జరుగకుంటే ఎందుకు జరుగలేదు?
ఒకవేళ జరిగే ఉంటే ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? వాటిలో KCR తో పాటు
విద్యార్థులు,మేధావులు, జయశంకర్ వంటి నిష్కామజీవులూ ఉన్నారుగా?
2. ఇక మాటిమాటికి పొట్టిశ్రీరాములుగారిని ప్రస్తావిస్తున్నారు. అసలు ఆయనకూ తెలంగాణాకు సంబంధం ఏమిటి?
ఆ మహానుభావుణ్ణీ ఎందుకు ఇందులోకి లాగుతున్నారు?
మరోమాట.. మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయేందుకు పొట్టిశ్రీరాములు దీక్ష చేస్తే అది ఘనకార్యమా? అదే తెలంగాణా విడిపోవాలని KCR చేస్తే మాత్రం అది కుహనా వేర్పాటువాదమా?
3. అసలు తెలంగాణా విడివడితే వారికేం లాభం? మిగిలిన సీమాంధ్రులకు ఏం నష్టం?
4. తెలంగాణా విడివడితే రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకు చస్తారా? లేకుంటే అతి ప్రేమతో ఆప్యాయంగా ఉంటారా?
5. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అక్కడున్న తెలంగాణా కూలీలను తరిమేశారని చదివాం. అది సమైక్యంగా ఉండడానికి చిహ్నమా? ఇటువంటిపని తెలంగాణావాళ్ళు ఉద్యమసమయంలోనో తర్వాతనో చేస్తున్నారా? లేక దీని నుండి పాఠం నేర్చుకొని వాళ్ళూ ఇలాగే చెయ్యాలా? అలా చేస్తే ఎంతమంది సీమాంధ్రులు ఉపాధులు కోల్పోతారో తెలుసా?


ఇవండీ నేను సంధించిన ప్రశ్నలు. ఇందులో ఎక్కడైనా నిందనో, ఇంకేదైనా అభ్యంతరకరమైంది ఉందా? మీరే చెప్పండి. దీన్ని పోష్ట్ చెయ్యలేదు. ఇక వీళ్ళతో కలిసి మెలిసి ఉండాలట....