Saturday, January 2, 2010

తెలంగాణ ఉద్యోగాలు

"ఆంధ్రులు తెలంగాణ వారి ఉద్యోగాలు కొట్టేస్తున్నారు" అనేదానిని సీమాంధ్రులు తేలికగా కొట్టేస్తున్నారు. అవి కేవలం అబద్ధాల మాటలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. "ఎవరికి తెలివి ఉంటే వారికే ఉద్యోగాలు వస్తాయి" అని ఓ అతితెలివి లాజిక్ ప్రయోగించి స(ఇ)కిలిస్తారు. కానీ ఈ రోజు మా యూనియన్ మిత్రుడితో జరిగిన సంభాషణలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి.

హైదరాబాద్‌‌లో ఉన్న మా ప్రధానకార్యాలయంలో ఇరువయ్యేళ్ళక్రితం(మేము ఉద్యోగంలో చేరేనాటికి) అన్ని పోష్ట్స్ ఉండేవి కావు. ఎంతోమంది క్లర్క్స్, సెక్షన్ ఆఫీసర్స్ మా కళ్ళముందే అక్కడ ఉద్యోగాల్లో చేరారు. అయితే అందరూ తెలంగాణేతరులే.

"వారి నియామకం పత్రికాప్రకటనలద్వారా చేసారా?" అని నేను అడిగా.

"కాదు వారు హైదరాబాద్ ఉపాధికల్పనా కార్యాలయంనుండి కాల్‌లెటర్స్ వస్తే, ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యి, ఉద్యోగాలు సంపాదించార"ని మా యూనియన్ మిత్రుడు తెలిపాడు.

"అదెలా సాధ్యం? హైదరాబాద్ ఎంప్లాయ్‌‌మెంట్ ఎక్స్చేంజ్‌‌లో తెలంగాణేతరులు ఎలా నమోదయ్యారు?" అనేది నా సందేహం.

ఆయన చెప్పాడు "తెలివంటే పుస్తకాల్లోని చదువు అనుకునే స్వాతిముత్యాలకు ఇది విచిత్రం. కాని, బ్రతికే తెలివి ఉన్నవాడు అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటాడు. నువ్వు దీనికే ఆశ్చర్యపడుతున్నావు. మన హెడ్ ఆఫీస్‌‌లో పనిచేసే 'ఫలానా' సెక్షన్ ఆఫీసర్ విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో వేరే ఉద్యోగం చేస్తూ, ఇక్కడ అప్పుడే హైదరాబాద్ ఎంప్లాయ్‌‌మెంట్ ఆఫీస్‌‌లో పేరు నమోదు చేసుకొని, కాల్‌లెటర్ తెచ్చుకొన్నాడు" అని.

"ఇన్ని తెలిసిన నువ్వు వీటిపై ఏమి చర్య తీసుకున్నావు?" నా ప్రశ్న.

"మన హెడ్ ఆఫీస్‌‌లో ఎవరెవరు ఎక్కడివారో ఆధారాలతో తెలుపుతూ, 610 జి.వో. అమలు పర్యవేక్షణాధికారి రవికాంత్ రెడ్డి/రమాకాంత్ రెడ్డి (ఆ పేరు మర్చిపోయా) గారికి లేఖలు సమర్పించాము. కానీ ప్రయోజనం ఏమీ లేదు. ప్రభుత వారిది. ఎవ్వరేం చెయ్యలేరు."

"మరి ఇవన్నీ వివరాలు పత్రికలో వస్తే...?"

"ఎంత అమాయకుడవు తమ్మీ! పత్రికల్ల్లో వార్తలకు భయపడినవాడెవడయ్యా? ఆ మధ్యలో గురుకులవిద్యాలయాల్లో దొంగ సర్టిఫికెట్స్ తో ఉపాధ్యాయులుగా చేరినారనే వార్త చదివావా పత్రికల్లో? వాళ్ళు కడప జిల్లావాళ్ళు. అప్పటి ముఖ్యమంత్రి జిల్లావారైరి. వారు ఈరోజుకూ హాయిగా ఉద్యోగాలు చేస్తున్నారు. వారిమీద ఈ నాటికీ ఏ విధమైన విచారణా లేదు. అదే పని నువ్వు చేసి ఉంటే... దానికి కటకటాలు లెక్కపెట్టేవాడివి. అదీ తేడా నీకూ , తెలంగాణేతరుణికీ. "

నా తలకాయ గిర్రున తిరిగింది. అయినా ఇన్ని చెప్పినా మన సమైక్యాంధ్ర అన్నలు బుకాయిస్తూనే ఉంటారు. అయినా వారు కోరే సమైక్యాంధ్ర అందుకేగా?

షరా :- 'దొర' గారు పెద్ద కొత్వాలుగా ఉన్న కాలంలో ఒకేసారి శ్రీకాకుళం జిల్లానుండి ౩౦౦౦ మంది హోంగార్డ్స్‌‌ని తీసుకొన్నారు. ఒకే జిల్లాలో అంతమంది సమర్థులు ఎలా దొరికారో? మిగిలిన జిల్లాల్లో ఎందుకు లేరో? ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్.

Friday, January 1, 2010

ఆంధ్రా సి.యం.ను అనే అర్హత తెలంగాణీయులకు లేదు

అయ్యలారా తెలంగాణావాదులారా!

మీరు అనవసరంగా రోషయ్యగారిని అపార్థం చేసుకుంటున్నారు " ఈయన మమ్మల్ని ఒకతీరు, సీమాంధ్రులని ఒకతీరు చూస్తున్నాడు" అంటూ.
కానీ, ఇందులో ఆయన తప్పేమీ లేదు.అంతా శాస్త్రోక్తమే జరుగుతుంది. ఎందుకంటే వారు ఒక్క తెలంగాణాకో, మరే ప్రాంతానికో మాత్రమే ముఖ్యమంత్రి కారు.వారు ప్రస్తుతమున్న సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రివర్యులు. మీరా విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి సమైక్యాంధ్ర ఉద్యమకారులకు వారు సహకరించడం తప్పు కాదు. అందులో ప్రాంతీయ తత్వం అస్సలు లేదు. ప్రస్తుతం మీరూ సమైక్యాంధ్రలోనే ఉన్నారు. గుర్తుంచుకోండి. అంటే వారు తమరిపక్షమూ వహించారని తాత్పర్యం. అది ప్రభుత్వపాలసీని చక్కగా అమలు పర్చడం అన్నమాట. అందుకే వారూ, వారి రజాకర్లూ పాటు పడతారు.అది తథ్యం. అర్థం చేసుకోలేకపోతె అది తమ ఖర్మ.

ఇక మరోవాదం.తెలంగాణా వాదులని అన్యాయంగా అణచివేస్తున్నారని. అయ్యా! తమరిది వేర్పాటువాదం. తమరు వేరువడి మీ ప్రాంతాన్ని పక్కనున్న పాలి దేశంలో కలుపుదామని చూస్తున్నారు. కాబట్టి వేర్పాటువాదాన్ని,వాదులనూ ఏ ప్రభుత్వమూ సహించదు కాక సహించదు. అందులోనూ తప్పేమీ లేదు. అదీ శాస్త్రోక్తమే!

ఇక ప్రత్యేకాంధ్ర ఉద్యమకారులను ఎలా చూస్తున్నరో నాకు తెలీదు కానీ వారి పట్ల కొంచెం ఎక్కువ సమదృష్టితో చూస్తే తప్పేమీ లేదు. ఎందుకంటే ఎవరికైనా జన్మభూమిపై మమకారం ఉండి తీరాల్సిందే. ఉండకుంటేనే తప్పు.

కాబట్టి తెలంగాణావాదులారా అందరూ మూస్కొని, రోషయ్యవారి మహత్వపూర్ణమైన పరిపాలనను వేనోళ్ళ పొగడండి.పుణ్యం వస్తుంది.