Wednesday, December 30, 2009

సమైక్యాంధ్రోద్యమం?

సమైక్యాంధ్ర ఉద్యమ సందర్భంగా ఆ కాలం లో నాకు కలిగిన భావాలు .....ఆంధ్రా అన్నతో తెలంగాణ తమ్ముడి మాటలు గేయ రూపంలో.....

అన్నా! నీ కడుపునిండ
మేమంటే పామురమే !
తమ్ముళ్ళని గారువమే
అర్లుగారి పోతున్నదె !

కంటినిండ కనికారం
హృదయంలో ఉపకారం
విడువలేని మమకారం
తెలియ లేని మూర్ఖులమే !

తమిళులతో పడకుంటే
విడిపొదామని యంటివి
అదే మేము అడుగుతుంటె
కలిసుందా మంటున్నవు
అన్నా! నీ కడుపునిండ
మేమంటే పామురమే?

అరవలతో అలిసి పోయి
విడిపోయే దొకనీతి
బక్కోళ్ళను విడువకుండ
కలిపుంచుట మరో నీతి
అన్నా! నీ నీతి ముందు
కౌటిల్యం బలాదూరు.

అసెంబ్లీలొ వద్దన్నా
నీ రాష్ట్రం సాధిస్తివి
మా రాష్ట్రం కోసమైతే
గదే అడ్డు చెబుతుంటివి
అన్నా! నీ కత్తికైతె
రెండక్కల పదునుందే!

తమిళులతో విడివడితే
మద్రాసును అడుగుతవా?
తెలంగాణ విడిపోతే
హైద్రబాదు గావాల్నా?
నీ ఆస్తికి అంతుందా?
అంత పెద్ద కడుపుందా?

ఒల్ల నిన్ను పొమ్మన్నా
మల్ల మల్ల వస్తున్నవ్
సల్లగ పుల్లగ నీకు
సక్కంగనె ఉన్నది లే!
పిల్లికేమొ చెలగాటం
ఎలుకకేమొ యమగండం

విడిపోదామంటుంటే
"అందరనా" లంటున్నవు
గొంగట్లో పెండ లెక్క
పట్టుకోని విడిపోవూ?
బలవంతపు సంసారం
బతికి బట్టగడ్తదా?

శతాబ్దాల ఉద్యమాలు
ఉత్తగానె కనిపిస్తయ్
రాత్రి రాత్రి పుట్టుకొస్తె
గొప్పగానె అనిపిస్తయ్
ఉద్యమాల తీరు తెన్ను
నీ నుంచే నేర్వాలే.

తెలంగాణ అన్నప్పుడె
లేని తలలు పుట్టుకొచ్చు
రాయలోరి రాజ్యమనీ
కళింగాంధ్రదేశమనీ
నడుమనోడు నడిపించే
నాటకాలు తెల్వయానె?

రాబోయే ఆంధ్రరాష్ట్ర
ముక్యమంత్రి పీటానికి
సూటివెట్టి యాడించకు
సూటిగ గజ్జెప్పరాదె?
అన్నా! నీ తెలివిముందు
తెల్లోడే తెల్లవోవు

క్షణాల్లోనె ఉద్యమాలు
రగిలించే తెలివి నీది
నిన్నుజూసి మావోళ్ళూ
సోయి దెచ్చుకుంటున్నరు
"అవసరాన్ని బట్టి ముందు
రాజినామ" అంటున్నరు

"పెద్దమనిషి కప్పగిస్తె
గిట్ల జేస్తదనుకోలే"
పిల్లనిచ్చి పెళ్ళి జేస్తె
తల్లి జేస్తడనుకోలే

రెండు నాల్కలున్నందుకు
పామునైతె జంప్తమాయె
నాల్గు నాల్కలుండి గూడ
అన్నవయ్యె బతికితివి

మాట లేదు పార్టి లేదు
ఆడితప్పు ఘన చరితులు
బలిపశువును విడువకుండ
కలిసుండే అద్వైతులు

సిగ్గు లేని నీ తెగింపె
లోకంలో గొప్పది లే.

-------

4 comments:

  1. ఆంధ్ర వారి ద్యందనీతి తెలంగాణా వారికీ కూడా వచ్చి వుంటే ఎంత బాగుండునో ......

    ReplyDelete
  2. >>> అరవలతో అలిసి పోయి
    విడిపోయే దొకనీతి
    బక్కోళ్ళను విడువకుండ
    కలిపుంచుట మరో నీతి
    అన్నా! నీ నీతి ముందు
    కౌటిల్యం బలాదూరు.

    అసెంబ్లీలొ వద్దన్నా
    నీ రాష్ట్రం సాధిస్తివి
    మా రాష్ట్రం కోసమైతే
    గదే అడ్డు చెబుతుంటివి
    అన్నా! నీ కత్తికైతె
    రెండక్కల పదునుందే!
    <<<

    కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు, పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, వ్యాఘ్రం కప్పుకున్న గోవు ముసుగును తొలగించి చిటికెడు పదాల్లో ఎంత బాగా చెప్పినవ్ భాయ్. దండాలు !
    జై తెలంగాణా

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete